అమెరికా ఎన్నికల్లో కఠిన నిబంధనలు తీసుకురావాలన్న తన వాదనకు మద్దతుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల విధానాన్ని ప్రశంసించారు. అమెరికాలో ఓటర్లకు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు ఉండాలా? అంటూ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రశ్నించిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు.

భారత్‌లో జరిగిన తాజా సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మందికి పైగా ఓటు వేసినప్పటికీ.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారు ఒక శాతంలోపే ఉన్నారని ట్రంప్ తెలిపారు. ప్రతి ఓటరూ చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ కలిగి ఉండాల్సిందేనని పేర్కొన్నారు.

అమెరికా ఓటర్ల అర్హతను పరిరక్షించేందుకు ‘సేవ్ అమెరికా చట్టం’ను ఆమోదించాలని ట్రంప్ కోరుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఓటరు నమోదుకు పౌరసత్వ ఆధారం, దేశవ్యాప్తంగా ఓటర్ ఐడీ తప్పనిసరి కానుంది. పోస్టల్ బ్యాలెట్‌పై కూడా ఆంక్షలు పెరగనున్నాయి. అయితే ఈ ప్రతిపాదనపై అమెరికా రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.