భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక మైలురాయిని చేరుకుంది. చంద్రయాన్-2 ఆర్బిటర్ పంపిన డేటా ఆధారంగా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలోని బిలాల్లో ఉపరితలం కింద మంచు (వాటర్ ఐస్) ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ (DFSAR) సాయంతో ఈ పరిశోధనలు నిర్వహించారు.

సూర్యకాంతి ఎప్పుడూ చేరని అత్యంత శీతల ప్రాంతాల్లో సుమారు -248 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద బిలియన్ల ఏళ్ల నాటి మంచు ఉండొచ్చని వారు వెల్లడించారు. భవిష్యత్ చంద్రయానాలు, మానవ నివాసాల ఏర్పాటుకు ఈ ఆవిష్కరణ కీలకంగా మారనుంది.