ఇండోనేషియాలోని అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది..! సుమారు 24 గంటల పాటు లావా, బూడిదను ఏకధాటిగా వెదజల్లడంతో భారీ బూడిద మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
బూడిద మేఘాల కారణంగా జకార్తాలోని సోకర్నో-హట్టా, హలిమ్ పెర్దనకుసుమ సహా 8 ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. సుమారు 2,300 విమాన సర్వీసులు రద్దు లేదా దారి మళ్లించగా.. 2.70 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జియోలాజికల్ ఏజెన్సీ లెవెల్-3 హై అలర్ట్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 2018లో ఇదే అగ్నిపర్వతం కారణంగా సంభవించిన సునామీలో సుమారు 430 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం బూడిద, విష వాయువులు, వేడి రాళ్ల ముప్పు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు.














