నేపాల్‌ను వణికిస్తున్న భారీ వరదల్లో ఓ హృదయాన్ని కదిలించే ఘటన వెలుగులోకి వచ్చింది. రసువా జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. కేవలం నెలన్నర వయసున్న ఓ పసికందును రక్షణ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భారీ వరదలు.. చుట్టూ బురద, శిథిలాలు.. ఎటు చూసినా విధ్వంసమే! ఇలాంటి భయానక పరిస్థితుల్లో ఆ చిన్నారిని కాపాడి ధాంగే క్యాంప్‌కు తరలించారు.ఈ చిన్నారి రక్షణ.. వరద విలయంలోనూ ఆశ, మానవత్వానికి ప్రతీకగా నిలిచింది.

మరోవైపు నేపాల్‌లో వరదల బీభత్సం మరింత విషాదాన్ని మిగుల్చుతోంది. మంగళవారం నాటికి మృతుల సంఖ్య 987కి చేరింది. మరో 3,916 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 583 మంది విదేశీయులు ఉన్నారు.

వరదల కారణంగా రోడ్లు, వంతెనలు, ఇళ్లు, గ్రామాలతో పాటు హైడ్రోపవర్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేపాల్ ఆర్మీతో పాటు భద్రతా బలగాలు.. ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి.

ఇక మృతుల్లో భారతీయులతో పాటు విదేశీయుల మృతదేహాలను గుర్తించి స్వదేశాలకు తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ప్రక్రియను ప్రకటించింది.

ఫింగర్‌ప్రింట్స్, డీఎన్‌ఏ, ఫోరెన్సిక్ శాంపిల్స్ సేకరణతో పాటు పాస్‌పోర్ట్, ఇతర గుర్తింపు పత్రాల పరిశీలన, పోస్టుమార్టం, అధికారిక గుర్తింపు వంటి ప్రక్రియల ద్వారా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

గుర్తుపట్టలేని మృతదేహాలను తాత్కాలికంగా ఖననం చేసిన సందర్భాల్లో.. తల్లిదండ్రులు, సొంత అన్నదమ్ములు లేదా పిల్లల డీఎన్‌ఏతో సరిపోల్చి గుర్తించే అవకాశం ఉంటుంది.

ఒకవైపు వందలాది ప్రాణాలను బలిగొన్న ప్రకృతి విపత్తు.. మరోవైపు నెలన్నర చిన్నారిని సురక్షితంగా కాపాడిన రక్షణ సిబ్బంది..
నేపాల్ వరదల్లో ఈ చిన్నారి రక్షణ మాత్రం ఆశను నింపుతున్న అరుదైన దృశ్యంగా నిలిచింది.