నేపాల్‌లో భారీ కొండచరియలు విరిగిపడటంతో చమేలియా నదికి పాక్షికంగా అడ్డంకి ఏర్పడింది. దీంతో నదిలో నీరు భారీగా నిలిచిపోయి.. అక్కడ కృత్రిమ సరస్సు ఏర్పడింది. ఎడతెరిపిలేని వర్షాలతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.
దార్చులా జిల్లాలోని ఆపి హిమాల్ గ్రామీణ మున్సిపాలిటీ పరిధిలోని భట్టాడ్ ప్రాంతంలో కొండలోని భారీ భాగం ఒక్కసారిగా చమేలియా నదిలోకి జారిపడింది. దీంతో నది ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది.
చమేలియా నది భారత్‌లోని సిమ్పాని సమీపంలో కాళీ నదిలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో సహజంగా ఏర్పడిన మట్టి కట్ట ఒక్కసారిగా తెగిపోతే.. భారీగా నిలిచిన నీరు కాళీ నదిలోకి చేరి భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు.
ముందస్తు జాగ్రత్తగా నదికి సమీపంలో నివసిస్తున్న 15 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చమేలియా, అప్పర్ చమేలియా, మిడిల్ చమేలియా జలవిద్యుత్ ప్రాజెక్టుల సిబ్బందిని కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
అయితే ప్రస్తుతం నదిలో సగానికి పైగా ప్రవాహం కొనసాగుతోందని.. తక్షణ ప్రమాదం లేదని దార్చులా జిల్లా అధికారులు తెలిపారు. మరోవైపు భారీ వర్షాలు కొనసాగుతుండటంతో మరిన్ని కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
భారత్‌లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. పిథోరాగఢ్ జిల్లాలో పోలీసులు, సశస్త్ర సీమా బల్ సహా సంబంధిత విభాగాలను అలర్ట్ చేశారు. కాళీ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.












