రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ వేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్.. రష్యా, ఉక్రెయిన్‌లలో పర్యటించి శాంతి చర్చలు జరపనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
చర్చలు జరిగే సమయంలో తమ వైపు నుంచి ఎలాంటి వైమానిక దాడులు ఉండవని.. రష్యా కూడా అదే విధంగా కాల్పుల విరమణ పాటించాలని జెలెన్‌స్కీ కోరారు. చర్చలకు అవసరమైనంత సమయం ఈ తాత్కాలిక విరమణ కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు.
ఇక ట్రంప్ ప్రతినిధులు శనివారం మాస్కోకు, ఆదివారం కీవ్‌కు వెళ్లనున్నట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. శాంతి ఒప్పందానికి సంబంధించిన సాధ్యమైన నిబంధనలపై వారు ఇరు దేశాల నేతలతో చర్చించనున్నారు.
అయితే.. ఈ ప్రకటనకు కొన్ని గంటల ముందే రష్యా కీవ్‌లోని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై పగటిపూట వైమానిక దాడి చేసింది. ఇటీవల రష్యా పగటిపూట దాడులను మరింత తీవ్రతరం చేసిందని జెలెన్‌స్కీ ఆరోపించారు.
ఒడెసా ప్రాంతంలో జరిగిన మరో రష్యా దాడిలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. డ్నిప్రో ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఈ పరిస్థితుల్లో తాత్కాలిక కాల్పుల విరమణకు జెలెన్‌స్కీ చేసిన ప్రతిపాదనపై రష్యా స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












