కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. చిన్నారి కనిపించకుండా 11 రోజులు గడిచినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తును మరింత విస్తరించారు.
దర్యాప్తులో భాగంగా చిన్నారిని అడవి జంతువులు లాక్కెళ్లి ఉండవచ్చనే అనుమానంతో అధికారులు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. చిన్నారి ఆకారాన్ని పోలిన బొమ్మల్లో మాంసాహారం ఉంచి, కుటుంబం నివసిస్తున్న తోట సమీపంలోని కంచెల వద్ద ఏర్పాటు చేశారు. అడవి జంతువులు ఆ ప్రాంతంలో సంచరిస్తే వాటి కదలికలను గుర్తించేందుకు ఈ చర్యలు చేపట్టారు.
బొమ్మల వద్ద ప్రత్యేక కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాల సహాయంతో తోట పరిసర ప్రాంతాలు, సమీప కొండ ప్రాంతాలను అటవీ శాఖ, పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు జల్లెడ పట్టాయి. అయినప్పటికీ చిన్నారి ఆచూకీకి సంబంధించిన స్పష్టమైన సమాచారం లభించలేదు.
ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క కూడా ఇటీవల మృతి చెందడంతో మిస్టరీ మరింత పెరిగింది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు ఆమెతో పాటు ఉన్న ఆ కుక్క తిరిగి ఇంటికి వచ్చినప్పటికీ, దాని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు దానిపై కూడా దృష్టి సారించారు.
చిన్నారి కోసం 400 మందికిపైగా పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, విపత్తు స్పందన బలగాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే ఇప్పటివరకు జ్ఞానేశ్వరి జాడ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.













