సముద్ర జీవులను ఉపయోగించి తమ దేశంపై గూఢచర్యం జరుగుతోందంటూ చైనా సంచలన ఆరోపణలు చేసింది. విదేశీ శక్తులు తాబేళ్లు, చేపలు వంటి సముద్ర జీవులకు ప్రత్యేక సెన్సర్లు అమర్చి చైనా తీర జలాల్లోకి పంపిస్తున్నాయని చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఈ పరికరాల ద్వారా సముద్ర ప్రాంతాలకు సంబంధించిన కీలక సమాచారం, వ్యూహాత్మక రహస్యాలను సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. పశ్చిమ దేశాల గూఢచార సంస్థలు ఆధునిక సాంకేతికతను వినియోగించి తమ దేశంపై నిఘా పెడుతున్నాయని ఆరోపించింది.
అలాగే సముద్ర భద్రత, సున్నితమైన సమాచార పరిరక్షణ విషయంలో అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని చైనా సూచించింది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి చైనా ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలను వెల్లడించలేదు.











