టెలివిజన్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి సంచిత ఉగలే 22 ఏళ్ల వయసులో మృతి చెందడం అభిమానులను, సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఆమె మృతిచెందినట్లు సమాచారం.

సంచిత ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్‌లో దియా పాత్రతో మంచి గుర్తింపు పొందింది. అలాగే ‘వాగ్లే కి దునియా’, ‘దిల్‌వాలీ దుల్హా లే జాయేగీ’ వంటి టీవీ షోలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

టెలివిజన్‌తో పాటు సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’, మనోజ్ బాజ్‌పేయి నటించిన ‘సైలెన్స్ 2’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.4 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉండగా, విశ్పర్, పార్లే-జీ, క్యాడ్‌బరీ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో కూడా నటించింది.

ఆమె మరణానికి ఒక రోజు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సంచిత ‘దఫ్లీవాలే దఫ్లీ బజా’ పాటకు లిప్‌సింక్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించింది. దీంతో ఆమె ఆకస్మిక మరణం అభిమానులను మరింత కలచివేసింది.

ఈ వార్తపై స్పందించిన ఆమె సహనటి రిచా సోని, "మొదట ఈ వార్తను నమ్మలేకపోయాను. మేమిద్దరం కలిసి పనిచేశాం. ఆమెను వ్యక్తిగతంగా తెలుసు. ఇది నిజమని తెలిసి షాక్ అయ్యాను" అని పేర్కొన్నారు.

కెరీర్ ప్రారంభ దశలోనే సంచిత ఉగలే మృతి చెందడం టెలివిజన్, సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.