ఢిల్లీలో CNG ధరలు మరోసారి పెరిగాయి. కిలోకు రూ.3.89 చొప్పున పెంచుతున్నట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) ప్రకటించింది. ఈ పెంపు ఆగస్టు 29 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది.
దీంతో ఢిల్లీలో CNG ధర కిలో రూ.83.09 నుంచి రూ.86.98కి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఢిల్లీలో CNG ధర దాదాపు రూ.10 వరకు పెరిగింది.
నోయిడా, ఘాజియాబాద్‌లో CNG ధర రూ.95.59, గురుగ్రామ్‌లో రూ.92.01కి చేరింది.
అయితే.. ఢిల్లీ ఇళ్లకు పైపుల ద్వారా సరఫరా చేసే PNG ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం PNG ధర స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ.49.59గా కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా LNG ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు IGL తెలిపింది. వెస్ట్ ఏషియా సంక్షోభం, హోర్ముజ్ జలసంధి ద్వారా LNG కార్గో రవాణాలో అంతరాయాలు రావడంతో అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగాయని పేర్కొంది.
ఇక యూరప్‌లో శీతాకాలానికి ముందు గ్యాస్ నిల్వలను పెంచుకునేందుకు డిమాండ్ పెరగడం కూడా అంతర్జాతీయ ధరలపై ప్రభావం చూపుతోందని IGL వెల్లడించింది.
పెరిగిన ఇన్‌పుట్ గ్యాస్ ఖర్చును కొంతవరకు భర్తీ చేసేందుకు రూ.3.89 పెంపు తప్పనిసరైందని సంస్థ స్పష్టం చేసింది.









