కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20 శాతం ఎథనాల్ మిశ్రమం (E20) పెట్రోల్ భద్రతపై బహిరంగంగా మద్దతు తెలిపిన భారత ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు, అంతర్గతంగా మాత్రం ఇంధనంలో కలుషితంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు రాయిటర్స్ పరిశీలించిన ఈమెయిల్స్ వెల్లడించాయి. ఈ సంస్థల్లో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా ఉన్నాయి.
రాయిటర్స్ కథనం ప్రకారం, ఈ కంపెనీలు ఏడాది కాలంలో దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 250కు పైగా E20 ఇంధన నమూనాలను సేకరించి పరీక్షించాయి. వాటిలో 18 రాష్ట్రాల్లో క్లోరైడ్ మోతాదులు, అలాగే అనేక ప్రాంతాల్లో తేమ (Moisture) స్థాయిలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితిని మించాయని గుర్తించాయి. క్లోరైడ్ అధికంగా ఉండటం వల్ల వాహనాల ఇంజిన్ భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, అధిక తేమ వల్ల వాహనం ఇంధనం నింపిన వెంటనే పనిచేయకుండా పోయే అవకాశం ఉందని అంతర్గత చర్చల్లో పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది.
ఈ ఆందోళనల నేపథ్యంలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) జూలై 28న కేంద్ర ప్రభుత్వానికి ఇంధన కాలుష్యంపై లేఖ పంపింది. అయితే ప్రభుత్వం, ప్రజల నుంచి స్పందన వచ్చిన అనంతరం "కొన్ని గణాంకాలకు మరింత ధృవీకరణ అవసరం" అని పేర్కొంటూ ఆ లేఖను వెనక్కి తీసుకుంది. అంతర్గత ఈమెయిల్స్‌లో మాత్రం డేటా విశ్వసనీయతపై ఎలాంటి సందేహాలు వ్యక్తం కాలేదని రాయిటర్స్ పేర్కొంది.
అయితే కేంద్ర పెట్రోలియం శాఖ, ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో E20 పెట్రోల్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని, విస్తృత స్థాయిలో కాలుష్యానికి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశాయి. మహీంద్రా కూడా ఈమెయిల్స్ ఆధారంగా వచ్చిన కొన్ని వ్యాఖ్యానాలను ఖండించగా, మారుతి సుజుకి, టాటా మోటార్స్ ఈ అంశంపై స్పందించలేదు.












