బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీంతో ఈ ధరలను ఎవరు నిర్ణయిస్తారు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో జరిగే మార్పులు భారత్‌లోనూ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే ఇండియాలో బంగారం ధరలను ఎవరు ఫిక్స్ చేస్తారు? ప్రభుత్వమా? లేక వ్యాపారులా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తులం బంగారం సుమారు రూ.1.60 లక్షల వద్ద ఉంది. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు ప్రతిరోజూ ఒకేలా ఉండవు. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, డిమాండ్ వంటి అంశాల ఆధారంగా ధరల్లో మార్పులు జరుగుతాయి.

బంగారం ధరలను ఎవరు ఫిక్స్ చేస్తారు?

భారత్‌లో బంగారం ధరలను ప్రధానంగా ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) నిర్ణయిస్తుంది. ఈ సంస్థ అంతర్జాతీయ మార్కెట్ ధరలు, రూపాయి విలువ, దేశీయ డిమాండ్, పన్నులు, సరఫరా పరిస్థితులను ఆధారంగా తీసుకుని ధరలను ఫిక్స్ చేస్తుంది.

IBJA ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి బంగారం ధరలను విడుదల చేస్తుంది. ఈ ధరలకు ప్రభుత్వానికి లేదా వ్యక్తిగత వ్యాపారులకు ప్రత్యక్ష సంబంధం ఉండదు.

IBJA ఎలా పనిచేస్తుంది?

ఈ అసోసియేషన్‌లో బంగారం దిగుమతి దారులు, పెద్ద బ్యాంకులు, ప్రముఖ బులియన్ వ్యాపారులు సభ్యులుగా ఉంటారు. వీరు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మరియు దేశీయ ఆర్థిక పరిణామాలను పరిగణలోకి తీసుకుని ధరలను నిర్ణయిస్తారు.

ధరల్లో మార్పులకు కారణాలు

భారత్ ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు డాలర్లలో నిర్ణయించబడతాయి. రూపాయి విలువ పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి.

పండుగల సీజన్‌లో డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపుతుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, జీఎస్టీ కారణంగా కూడా ధరల్లో మార్పులు వస్తాయి. రవాణా ఖర్చులు మరియు ప్రాంతాల వారీ పరిస్థితుల ఆధారంగా కూడా బంగారం ధరలు మారుతాయి.