దేశంలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా మిషన్ లక్ష్యాలు ఆశించిన స్థాయిలో నెరవేరలేదని కాగ్ నివేదిక వెల్లడించింది. 2015-16 నుంచి 2024-25 మధ్య 1.4 మిలియన్ హెక్టార్లలో అడవి విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం 0.03 మిలియన్ హెక్టార్లలోనే పెరుగుదల నమోదైంది. అంటే లక్ష్యంలో ఏకంగా 97.57 శాతం లోటు ఉన్నట్లు కాగ్ పేర్కొంది.

అలాగే అడవుల నాణ్యతను మెరుగుపరచడంలోనూ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. 1.4 మిలియన్ హెక్టార్ల లక్ష్యానికి గాను కేవలం 0.11 మిలియన్ హెక్టార్లలోనే మెరుగుదల కనిపించింది.

16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ్రీన్ ఇండియా మిషన్ అమలును పరిశీలించిన కాగ్.. CAMPA, MGNREGS వంటి పథకాలతో సమన్వయం సరిగా జరగలేదని తెలిపింది. నిధుల నిర్వహణ, పర్యవేక్షణలోనూ లోపాలను ఎత్తిచూపింది.

మరోవైపు, 70 శాతం నమూనా ప్రాంతాల్లో గ్రీన్ ఇండియా మిషన్ కారణంగా చెప్పుకోదగ్గ మార్పులు కనిపించలేదని కాగ్ వెల్లడించింది. కొన్ని చోట్ల డేటాను అధికంగా చూపించారని కూడా ఆడిట్‌లో గుర్తించింది.