ఒడిశా పోలీస్‌ బాస్ మార్పుపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుత డీజీపీ వైబీ ఖురానియా ఆగస్టు 16న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. క్రైమ్ బ్రాంచ్ చీఫ్ వినయ్‌తోష్ మిశ్రాకు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శుక్రవారం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వినయ్‌తోష్ మిశ్రా ప్రస్తుతం సీఐడీ-క్రైమ్ బ్రాంచ్ డీజీపీగా పనిచేస్తున్నారు. 2025 జనవరిలో డీజీపీ గ్రేడ్‌కు పదోన్నతి పొందారు. పూర్తి స్థాయి డీజీపీ నియామకంపై స్పష్టత రాకపోవడంతో.. తాత్కాలికంగా మిశ్రాకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వైబీ ఖురానియా 2024 ఆగస్టు 16న ఒడిశా డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రెండేళ్ల పదవీకాలం ఆగస్టు 16తో ముగియనుంది. పదవీ విరమణకు రెండు రోజుల ముందు ఖురానియా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని భువనేశ్వర్‌లోని లోక్ సేవా భవన్‌లో కలిశారు.