ఢిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి గోవాకు మళ్లించారు. 229 మంది ప్రయాణికులతో గోవా నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండిగో ఫ్లైట్ 6E 2102.. టేకాఫ్ అయిన సుమారు 30 నిమిషాలకే వెనక్కి వచ్చింది.
ఇంజిన్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఉదయం 9:16 గంటలకు బయల్దేరిన విమానం.. 9:51 గంటలకు మోపాలోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే 28పై సురక్షితంగా ల్యాండ్ అయింది.
విమానంలో ఉన్న 229 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం విమానాన్ని మెయింటెనెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అవసరమైన అనుమతులు లభించిన తర్వాతే విమానం తిరిగి సేవల్లోకి వస్తుందని ఇండిగో తెలిపింది.
ప్రయాణికులు ఢిల్లీ చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.









