దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు సంస్థలు మరోసారి పెంచాయి. ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌పై రూ.42 పెరగగా, కోల్‌కతాలో రూ.53.50, చెన్నైలో రూ.46 మేర ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,294కు చేరింది.

అయితే ఇళ్లలో వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో గృహ వినియోగదారులకు తక్షణ ఊరట లభించింది.

కానీ కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లపై పడనుంది. ఇప్పటికే రవాణా ఖర్చులు, సీఎన్‌జీ ధరలు పెరగడంతో వ్యాపారులపై అదనపు భారం పడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో టిఫిన్లు, భోజనం, టీ, కాఫీ ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతలే ఈ ధరల పెంపుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అయితే దేశంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని, 30 రోజుల అత్యవసర నిల్వలు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు ఆదేశించింది. దీంతో గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.