చండీగఢ్-బడ్డీ మార్గంలో భారీగా సైకోట్రోపిక్ టాబ్లెట్లను కేంద్ర నార్కోటిక్స్ బ్యూరో (CBN) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ‘ఆపరేషన్ వజ్ర 2.0’లో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో 66 లక్షల 79 వేల 980 టాబ్లెట్లు పట్టుబడ్డాయి.
స్వాధీనం చేసుకున్న వాటిలో 59,08,100 అల్ప్రాజోలం, 7,47,780 ట్రామడాల్, 23,700 నైట్రాజెపామ్, 400 క్లోనాజెపామ్ టాబ్లెట్లు ఉన్నాయి. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసిన అధికారులు.. టాబ్లెట్లను తరలిస్తున్న ట్రక్కును సీజ్ చేశారు.
మధ్యప్రదేశ్ యూనిట్‌కు చెందిన నీమచ్ బృందానికి అందిన సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆగస్టు 27న యూపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న అనుమానాస్పద ట్రక్కును అధికారులు అడ్డుకున్నారు. తనిఖీల్లో 120 మాస్టర్ కార్టన్లలో దాచి ఉంచిన నియంత్రిత మందులు బయటపడ్డాయి.
అయితే, చాలా బ్లిస్టర్ ప్యాక్‌లు, బాక్సులపై బ్యాచ్ నంబర్లు, తయారీ తేదీలు, గడువు తేదీలు చెరిపేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ‘పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో విక్రయించరాదు’ అని ఉన్న మందులను కూడా తరలిస్తున్నట్లు వెల్లడైంది.
ఎలాంటి చెల్లుబాటు అయ్యే ఇన్వాయిస్‌లు, బిల్లులు, ఈ-వే బిల్లులు లేకుండానే ఈ సరుకును తరలిస్తున్నట్లు CBN తెలిపింది. 14 గంటలకు పైగా సాగిన లెక్కింపు, సీలింగ్ ప్రక్రియ అనంతరం టాబ్లెట్లు, ట్రక్కును NDPS చట్టం-1985 కింద సీజ్ చేశారు.
ఈ అక్రమ మందుల తయారీ, సరఫరా వెనుక ఉన్న మూలాలు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. 2026లో ఇప్పటివరకు CBN 197 కేసులు నమోదు చేసి, 272 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 51 వేల కిలోల మాదకద్రవ్యాలు, 12.7 కోట్లకు పైగా సైకోట్రోపిక్ టాబ్లెట్లు, క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.












