జమ్మూకశ్మీర్‌లో మతపరమైన హక్కులపై ఆంక్షలు సాధారణమవుతున్నాయంటూ కశ్మీర్ ప్రధాన ముస్లిం మత గురువు మిర్వైజ్ ఉమర్ ఫరూక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గృహ నిర్బంధం నుంచి విడుదలైన మరుసటి రోజే శ్రీనగర్ జామా మసీదులో ప్రార్థనల అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బడ్గామ్ జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన 12 ఏళ్ల బాలిక కుటుంబాన్ని పరామర్శించకుండా అడ్డుకోవడానికే తనను నిర్బంధించారని ఆరోపించారు. ఇద్-ఉల్-జుహా సందర్భంగా చారిత్రాత్మక ఇద్‌గాహ్ మైదానం, జామా మసీదులను మూసివేయడం వల్ల సామూహిక ప్రార్థనలు జరగలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ప్రజలు ప్రార్థనకు కూడే హక్కును కోల్పోతున్నారని అన్నారు. “అసాధారణమైన పరిస్థితులు సాధారణంగా కనిపించడం సమాజానికి అతిపెద్ద ప్రమాదం” అని హెచ్చరించారు. ప్రజల హక్కులు, మత సంస్థలు దెబ్బతింటున్న సమయంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు మౌనం వీడాలని ఆయన కోరారు. కశ్మీర్ ప్రజల మత, సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఎలాంటి ఆంక్షలు వచ్చినా విశ్వాసాన్ని ఎవరూ చెరపలేరని మిర్వైజ్ ఉమర్ ఫరూక్ స్పష్టం చేశారు.












