మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్‌లో ట్రాఫిక్ పోలీసులు భారీగా అక్రమ వాహనాలపై చర్యలు చేపట్టారు. గత 5–6 నెలల్లో 2,566 అక్రమ నంబర్ ప్లేట్లు, 569 అక్రమ సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్ పరిధిలోని మొత్తం 13 ట్రాఫిక్ డివిజన్లలో ఈ తనిఖీలు నిర్వహించారు.

సంగ్వి ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న నంబర్ ప్లేట్లను బుల్డోజర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. అక్రమ సైలెన్సర్ల వల్ల భారీ శబ్దం వస్తోందని, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందాయి.

దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో అక్రమ నంబర్ ప్లేట్లు, సైలెన్సర్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇకపై కూడా ఈ చర్యలు కొనసాగుతాయని ట్రాఫిక్ డీసీపీ విక్రాంత్ దేశ్‌ముఖ్ హెచ్చరించారు.

అయితే, పోలీసుల చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో లౌడ్ సైలెన్సర్ల శబ్దం మాత్రం ఇంకా తగ్గలేదని స్థానికులు చెబుతున్నారు.