ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్‌లో ప్రత్యేక సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ప్రముఖ సైకత శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ ఈ భారీ కళాకృతిని రూపొందించారు. 25 అడుగుల పొడవైన ఈ సైకత శిల్పాన్ని 2,500 మట్టి దీపాలతో అలంకరించి ప్రధాని మోదీకి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

“ఆశీర్వాద్ కా దియా.. 25 ఇయర్స్ ఆఫ్ సేవా.. హ్యాపీ బర్త్‌డే మోదీ జీ” అనే పేరుతో ఈ కళాకృతిని రూపొందించారు. భారత త్రివర్ణ పతాకం నేపథ్యంలో ప్రధాని మోదీ ముఖచిత్రాన్ని ఇసుకతో తీర్చిదిద్ది, దాని చుట్టూ 2,500 దీపాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ మాట్లాడుతూ.. దేశానికి నిరంతర సేవ అనే ఇతివృత్తంతో ఈ శిల్పాన్ని రూపొందించినట్లు తెలిపారు. 25 అడుగుల పొడవు ప్రధాని మోదీ ప్రజా సేవకు ప్రతీకగా, 2,500 దీపాలు ప్రజల ప్రార్థనలు, ఆశీస్సులు, శుభాకాంక్షలకు చిహ్నంగా నిలుస్తాయని వివరించారు. తన సుదర్శన్ సాండ్ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థుల సహాయంతో ఈ కళాకృతిని పూర్తి చేసినట్లు చెప్పారు.

ప్రధాని మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని జగన్నాథ స్వామిని ప్రార్థించినట్లు పట్నాయక్ తెలిపారు. ఈ ప్రత్యేక సైకత శిల్పాన్ని వీక్షించేందుకు స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో పూరీ బీచ్‌కు తరలివచ్చారు.

ఇదే సమయంలో మరో సైకత శిల్పి మానస్ కుమార్ సాహూ కూడా ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరో కళాకృతిని రూపొందించారు. దేశంలోని ఇటీవలి జాతీయ కార్యక్రమాలు, పరిణామాలను ప్రతిబింబించేలా ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలు, సేవా కార్యక్రమాల నేపథ్యంలో పూరీ తీరంలోని ఈ సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.