నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలతో తీవ్ర విషాదం నెలకొంది. గ్యిరోంగ్ ప్రాంతంలో వరదలకు గురైన తమ కైలాష్ యాత్రికుల బృందంలోని సుమారు 80 మంది ఆచూకీ తెలియకపోవడంతో ఆధ్యాత్మిక గురువు సద్గురు జగద్గీ వాసుదేవ్ భావోద్వేగానికి గురయ్యారు. పరిస్థితిని వివరిస్తూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రస్తుతం తాను సాగా ప్రాంతంలో ఉన్నానని తెలిపిన సద్గురు.. తనతో పాటు కొంతమంది వాలంటీర్లను గ్యిరోంగ్‌కు వెళ్లేందుకు అనుమతించాలని అధికారులను కోరారు. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని, బాధిత కుటుంబాలకు ఉపయోగపడే ఆధారాలను గుర్తించేందుకు మాత్రమే అక్కడికి వెళ్లాలనుకుంటున్నామని తెలిపారు.
“మేము ప్రస్తుతం సాగాలో ఉన్నాం. దయచేసి మమ్మల్ని గ్యిరోంగ్‌కు వెళ్లేందుకు అనుమతించండి. మా ఉద్దేశం రెస్క్యూ చర్యలకు ఆటంకం కలిగించడం కాదు.. బాధిత కుటుంబాలకు అండగా నిలవడమే” అంటూ సద్గురు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు.
గ్యిరోంగ్‌లోని ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న సమయంలోనే వరదలు సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు యాత్రికులు గల్లంతయ్యారు. వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.









