అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ 2026లో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి (వైఎస్‌ఆర్) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రవాస తెలుగు ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, సామాజిక నాయకులు కలిసి వైఎస్‌ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయనకు ఘన నివాళులర్పించారు. సభలో కొద్దిసేపు మౌనం పాటిస్తూ ఆయన ప్రజాసేవను స్మరించుకున్నారు.
వక్తలు మాట్లాడుతూ, వైఎస్‌ఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, రైతులు, విద్యార్థులు, పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయనను ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపాయని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమైన నాయకుడిగా, అభివృద్ధి మరియు సంక్షేమానికి కట్టుబడి పనిచేసిన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు.
ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్రవాస తెలుగు ప్రజలు వైఎస్‌ఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవే ఆయన అసలు వారసత్వమని పలువురు పేర్కొన్నారు.
ATA మహాసభలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు సమాజానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులను స్మరించుకునే వేదికగా కూడా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు సభలో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించగా, పాల్గొన్న వారంతా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.










