అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ 2026లో టాలీవుడ్ హీరో అడివి శేష్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొని సందడి చేశారు. వీరి రాకతో సభా ప్రాంగణం అభిమానుల కేరింతలతో మార్మోగింది.
ముందుగా మాట్లాడిన అడివి శేష్, సభకు విచ్చేసిన ప్రవాస తెలుగు ప్రజల ఉత్సాహాన్ని కొనియాడారు. "ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో యంగ్‌గా, ఎనర్జీతో కనిపిస్తున్నారు" అంటూ సరదాగా వ్యాఖ్యానించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. అనంతరం "లేడీస్ ఫస్ట్" అంటూ పూజా హెగ్డేను మాట్లాడాలని ఆహ్వానించారు.
అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన పూజా హెగ్డే, తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "తెలుగు అభిమానులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. ముఖ్యంగా 'బుట్ట బొమ్మ' అని ప్రేమగా పిలవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటాను" అని ఆమె అన్నారు.
ఇద్దరు సినీ తారలు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు సినిమాలను ఆదరిస్తూ, తెలుగు సంస్కృతిని నిలబెడుతున్న ప్రవాస భారతీయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సభ అనంతరం అభిమానులతో ఫొటోలు దిగుతూ, ఆత్మీయంగా పలకరించిన అడివి శేష్, పూజా హెగ్డే అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ప్రత్యేక సమావేశం ATA 2026 మహాసభల్లో అత్యంత ఆకర్షణీయమైన కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.










