డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ (DARA) ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డ్రైవ్ విజయవంతమైంది. ఆగస్టు 8న ఇర్వింగ్‌లోని Outpace LLC వద్ద Carter BloodCare సహకారంతో ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 29 మందికి పైగా స్క్రీనింగ్ జరగగా.. 21 మంది విజయవంతంగా రక్తదానం చేశారు. ఇటీవలి నెలల్లో Carter BloodCare నిర్వహించిన పెద్ద బ్లడ్ డ్రైవ్‌లలో ఇది ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

రక్తదానం చేసిన ప్రతి ఒక్కరూ మరొకరి ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందించారని DARA ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన రక్తదాతలు, వాలంటీర్లు, నిర్వాహకులు, మద్దతుదారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు DARA ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

DARA అధ్యక్షుడు వీర శివారెడ్డి లేవక నాయకత్వంలో DARA టీమ్ సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఒకరి రక్తదానం పలువురి ప్రాణాలను కాపాడగలదనే సందేశంతో సమాజ సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

“రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా కమ్యూనిటీ సేవలో DARA మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకుంది.