"భాషే రమ్యం.. సేవే గమ్యం" అనే నినాదానికి తగ్గట్టుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మరోసారి తన సేవా తత్వాన్ని చాటిచెప్పింది. నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫ్రిస్కో నగరంలోని మోనార్క్ వ్యూ పార్క్‌లో నిర్వహించిన "అడాప్ట్-ఎ-పార్క్" స్వచ్ఛంద సేవా కార్యక్రమం స్థానిక తెలుగు సమాజంలో విశేష స్పందనను సొంతం చేసుకుంది.

తెలుగు కుటుంబాలు, విద్యార్థులు, యువ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్క్ పరిశుభ్రత, పచ్చదనం పరిరక్షణ కోసం కలిసి పనిచేశారు. చెత్త తొలగించడం, పరిసరాలను శుభ్రపరచడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం వంటి కార్యక్రమాలతో ఈ సేవా కార్యక్రమం ఆదర్శంగా నిలిచింది.

ప్రత్యేకంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఆకట్టుకుంది. చిన్న వయసులోనే సమాజం పట్ల బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నాట్స్ చేపడుతున్న ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు, విద్యార్థులు చేసిన ఈ సేవలను భవిష్యత్తులో వారి విద్యా, వృత్తిపరమైన ప్రయాణాలకు ఉపయోగపడే అధికారిక వాలంటీర్ సర్వీస్ అవర్స్‌గా గుర్తించడం ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

ఈ సందర్భంగా తెలుగు విద్యార్థులు చూపిన సేవా భావం, అంకితభావాన్ని నాట్స్ అధ్యక్షులు రాజ్ అల్లాడ హృదయపూర్వకంగా అభినందించారు. సమాజానికి తిరిగి సేవ చేయాలనే స్ఫూర్తి ప్రతి యువతలో పెంపొందాలని, ఇలాంటి కార్యక్రమాల్లో మరింత మంది పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల మాట్లాడుతూ, రేపటి తరంలో సామాజిక బాధ్యతను పెంపొందించడమే నాట్స్ లక్ష్యమని అన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, పర్యావరణ చైతన్యం, సమాజం పట్ల బాధ్యత పెరుగుతాయని పేర్కొన్నారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ చేపట్టిన ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

స్థానిక సమాజం, పర్యావరణం, భావితరాల సంక్షేమం కోసం నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు తెలుగు సంఘాల సామాజిక బాధ్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

WhatsApp Image 2026-06-27 at 4.54.31 AM.jpeg