న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనపై Council of Fashion Designers of America (CFDA) CEO స్టీవెన్ కోల్బ్పై చర్యలు తీసుకున్నారు. PETA కార్యకర్తలతో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆయనను సెలవుపై పంపించినట్లు CFDA ప్రకటించింది.
న్యూయార్క్‌లో జరిగిన COS రన్‌వే షోలో PETA కార్యకర్తలు వూల్ వినియోగానికి వ్యతిరేకంగా రన్‌వేపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్న సమయంలో కోల్బ్ వారితో ఘర్షణకు దిగిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి.
ఈ ఘటనను CFDA తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. పూర్తి స్థాయి సమీక్ష పూర్తయ్యే వరకు కోల్బ్ సెలవులో ఉంటారని వెల్లడించింది.
తాను అనుచితంగా స్పందించానని తొలుత అంగీకరించిన కోల్బ్.. పరిస్థితిని సెక్యూరిటీ సిబ్బందికి వదిలేయాల్సిందని పేర్కొన్నారు. అనంతరం సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతూ.. ఘటనకు తానే బాధ్యత వహిస్తున్నానని తెలిపారు.
అలాగే, ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా ప్రొఫెషనల్ సహాయం తీసుకుంటున్నానని చెప్పారు. PETA ఆహ్వానాన్ని అంగీకరించి, సంస్థ ప్రతినిధులతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని, ఘటనలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, తమ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని భావిస్తున్నట్లు PETA తెలిపింది. గొర్రెల నుంచి వూల్ సేకరణలో హింస జరుగుతోందని ఆరోపిస్తూ.. H&M, COS బ్రాండ్లు వూల్ వినియోగాన్ని నిలిపివేయాలని PETA డిమాండ్ చేసింది.
300 మందికి పైగా అమెరికన్ డిజైనర్లకు ప్రాతినిధ్యం వహించే CFDAలో స్టీవెన్ కోల్బ్ 2006లో చేరారు. 2011లో CEOగా బాధ్యతలు స్వీకరించారు.













