అమెరికా నుంచి బ్రిటిష్ రైట్‌వింగ్ రాజకీయ వ్యాఖ్యాత మిలో యియానోపౌలోస్ డిపోర్ట్ అయ్యారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ICE అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ చర్య తీసుకున్నారు.
41 ఏళ్ల మిలోను ఆగస్టు 27న న్యూ ఓర్లీన్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. 2019 మేలో అమెరికాలోకి వచ్చిన ఆయన.. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయారని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.
“చట్టాలను ఉల్లంఘించి అమెరికాలో ఉండిపోయిన మిలోను ఆయన స్వదేశమైన బ్రిటన్‌కు పంపించాం” అని DHS ప్రకటించింది.
మిలో యియానోపౌలోస్ గతంలో బ్రీట్‌బార్ట్ న్యూస్ ఎడిటర్‌గా, అలాగే ర్యాపర్ కాన్యే వెస్ట్ రాజకీయ ప్రచారంలో పనిచేశారు. 2016లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన ఆయన.. ప్రస్తుతం ట్రంప్ విధానాలకు కొంతమేర మద్దతు ఇస్తూనే, అధ్యక్షుడిపై విమర్శలు కూడా చేస్తున్నారు.
ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు, ముస్లింలు, ఫెమినిస్టులు, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ వంటి అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో నిలిచారు.
మిలోను అరెస్ట్ చేయించడంలో తన పాత్ర ఉందంటూ ఫార్‌రైట్ కామెంటేటర్ లారా లూమర్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇకపై మిలో అమెరికాలోకి తిరిగి రావడానికి అనుమతి ఉండదని DHS తనకు తెలిపిందని ఆమె పేర్కొన్నారు.












