అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో నివసిస్తున్న దిలీప్ కుమార్ బుంగటావుల కారు ప్రమాదంలో మృతి చెందారు. ఎదురుగా వేగంగా వచ్చిన ఓ పికప్ ట్రక్కు.. దిలీప్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
దిలీప్ కుమార్ స్వస్థలం తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం జెట్టివారిపాలెం. వ్యవసాయ కుటుంబానికి చెందిన దిలీప్ కొన్నేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం కెంట్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో దిలీప్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ఇలా అర్ధంతరంగా మృతి చెందడం కుటుంబంలో విషాదాన్ని నింపింది.









