అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వీసా బాండ్‌ ప్రోగ్రామ్‌ను మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశాలపై అమెరికా ట్రావెల్ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కార్యక్రమం అంతర్జాతీయ పర్యాటకులను నిరుత్సాహపరిచి, అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు టూరిజం రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని U.S. Travel Association హెచ్చరించింది.

ప్రస్తుతం సుమారు 50 దేశాలకు ఈ కార్యక్రమం వర్తిస్తోంది. టూరిస్ట్, బిజినెస్ వీసాల కోసం దరఖాస్తు చేసే కొందరు ప్రయాణికులు గరిష్ఠంగా 20 వేల డాలర్ల వరకు రిఫండబుల్ బాండ్‌ చెల్లించాల్సి ఉంటుంది. వీసా నిబంధనలు ఉల్లంఘించినా లేదా గడువు ముగిసిన తర్వాత అమెరికాలో ఉంటే ఈ బాండ్‌ను ప్రభుత్వం జప్తు చేయవచ్చు.

2025 ఆగస్టులో పైలట్ ప్రోగ్రామ్‌గా ప్రారంభమైన ఈ విధానాన్ని ఇప్పుడు శాశ్వత విధానంగా మార్చారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలను, చివరకు అమెరికా వీసా అవసరమయ్యే అన్ని దేశాలను కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి.

U.S. Travel Association అధ్యక్షుడు జియోఫ్ ఫ్రీమన్ ఈ విస్తరణ అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించవచ్చని Reuters‌కు తెలిపారు. ఇప్పటికే కెనడా నుంచి అమెరికాకు వచ్చే సందర్శకుల్లో 25 శాతం, ఆసియా నుంచి వచ్చే ప్రయాణికుల్లో 50 శాతం వరకు 2019తో పోలిస్తే తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు.

2026 FIFA వరల్డ్ కప్‌ సమయంలోనూ అంతర్జాతీయ పర్యాటకం ఆశించిన స్థాయిలో పెరగకపోగా 1.8 శాతం తగ్గింది. మరోవైపు, కెనడా నుంచి అమెరికా పర్యటనలు 2025లో 2.91 కోట్లకు తగ్గాయి. మొత్తంగా అంతర్జాతీయ ప్రయాణికుల తగ్గుదల అమెరికా టూరిజం రంగంపై ఆందోళన పెంచుతోంది.

వీసా బాండ్‌ ప్రోగ్రామ్‌ను విస్తరించడంపై తుది నిర్ణయం తీసుకుంటే, అమెరికాకు వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉందని ట్రావెల్ ఇండస్ట్రీ హెచ్చరిస్తోంది.