కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న సీఎం సీటు వివాదానికి ఎట్టకేలకు తెరపడినట్లైంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఇక రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
డీకే శివకుమార్ సహా పలువురు మంత్రులతో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లిన సిద్ధరామయ్య.. తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యదర్శికి సమర్పించారు. గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం అధికారిక ఆమోదం వెలువడే అవకాశం ఉంది.
రాజీనామా అనంతరం భావోద్వేగంగా మాట్లాడిన సిద్ధరామయ్య.. కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 160 హామీల్లో 158 అమలు చేశామని చెప్పారు. ప్రజల సేవే తన లక్ష్యమని పేర్కొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం ఎంపికపై భారీ ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అప్పట్లో సిద్ధరామయ్యకు సీఎం పదవి, డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవి అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్.. ఇప్పుడు అధికార మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.












