ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండగా.. మైదానంలో పరుగుల కంటే సోషల్ మీడియాలో ఎవరి పేరు ఎక్కువగా మార్మోగుతోంది అన్నదానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన తాజా జాబితాలో విరాట్ కోహ్లీ మరోసారి నెంబర్ వన్‌గా నిలవగా.. మెరుపు బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మాత్రం చోటు దక్కకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

స్టార్ స్పోర్ట్స్ వివరాల ప్రకారం.. ఈ సీజన్‌లో 44 శాతం సోషల్ మీడియా చర్చలు విరాట్ కోహ్లీ చుట్టూనే తిరిగాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయినా కోహ్లీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆర్సీబీ అగ్రస్థానంలో నిలవడంలో ఆయన చేసిన 379 పరుగులు కీలకంగా మారాయి. 163 స్ట్రైక్‌రేట్‌తో కోహ్లీ ఆడుతున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ జాబితాలో 21 శాతం చర్చలతో మహేంద్ర సింగ్ ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. ఆశ్చర్యకరంగా ఈ సీజన్‌లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా ఆయనపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. రోహిత్ శర్మ 18 శాతంతో మూడో స్థానంలో నిలవగా.. సంజూ శాంసన్ 10 శాతం, కేఎల్ రాహుల్ 8 శాతం చర్చలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం.. 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరు టాప్-5లో లేకపోవడమే. ఈ సీజన్‌లో 236 స్ట్రైక్‌రేట్‌తో 440 పరుగులు చేసిన వైభవ్.. తన మెరుపు బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. గత సీజన్‌లో 35 బంతుల్లో శతకం బాది సంచలనం సృష్టించిన ఈ యువ ఆటగాడికి సోషల్ మీడియాలో మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడం చర్చనీయాంశమైంది.

ఇక అభిషేక్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. దీంతో సీనియర్ ఆటగాళ్ల బ్రాండ్ విలువ ఇంకా సోషల్ మీడియాలో ఎంత బలంగా ఉందో మరోసారి స్పష్టమైంది.