బంగ్లాదేశ్ పర్యటన నుంచి టీమిండియా తప్పుకుంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో సిరీస్‌కు దూరమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఇది భారీ ఎదురుదెబ్బగా మారింది.
అయితే బంగ్లా పర్యటనకు నో చెప్పిన టీమిండియా.. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు సిద్ధమైంది. ఈ సిరీస్‌కు అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్‌లోనే ఈ మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 13న తొలి టీ20, 15న రెండో టీ20, 19న మూడో మ్యాచ్ నిర్వహించనున్నారు.
అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు కొంతకాలంగా తన హోమ్ సిరీస్‌లను దుబాయ్‌తో పాటు భారత్‌లోనూ నిర్వహిస్తోంది. తాజాగా టీమిండియాతో సిరీస్‌ను కూడా భారత్‌లోనే నిర్వహించేందుకు నిర్ణయించింది. దీంతో స్వదేశంలోనే టీమిండియా పర్యాటక జట్టుగా బరిలోకి దిగనుంది.
అఫ్గాన్ క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ అన్ని విధాలా సహకరిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ తెలిపారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని.. భవిష్యత్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.









