ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 భారీ సిక్సర్లు ఉండగా, సెంచరీకి కేవలం ఏడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. ఈ ప్రదర్శనతో రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ధృవ్ జురెల్ 53 పరుగులతో మ్యాచ్‌ను ముగించాడు.

మరోవైపు ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నోకు మిచెల్ మార్ష్ 57 బంతుల్లో 96 పరుగులతో భారీ స్కోరు అందించాడు. జోస్ ఇంగ్లిస్ 60 పరుగులతో మంచి ఆరంభం ఇచ్చాడు. కానీ బౌలింగ్‌లో విఫలమైన లక్నో జట్టుకు వైభవ్ తుఫాన్‌కు సమాధానం దొరకలేదు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ వేసిన ఓవర్‌లో 29 పరుగులు రావడం మ్యాచ్ మలుపు తిప్పింది. రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో వరుస ఒత్తిడిలో కనిపించగా, రాజస్థాన్ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబైపై గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి.