భారతదేశంలో నిర్వహించే ఐపీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లపై ఎన్నో ఏళ్లుగా నిషేధం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ పేరు మళ్లీ చర్చకు వచ్చింది. కారణం… అతడు తాజాగా బ్రిటీష్ పౌరసత్వం పొందడం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం పాకిస్థాన్ పాస్‌పోర్ట్ కలిగిన ఆటగాళ్లపైనే నిషేధం ఉండటంతో, ఇప్పుడు బ్రిటన్ పాస్‌పోర్ట్‌తో అమీర్ చట్టపరంగా 2027 ఐపీఎల్ వేలంలో పాల్గొనే అర్హత సాధించాడు. గతంలో అజహర్ మహమూద్ కూడా బ్రిటన్ పౌరుడిగా ఐపీఎల్‌లో ఆడిన విషయం తెలిసిందే.
అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత ప్రభుత్వం, బీసీసీఐ కలిసి పాక్ ఆటగాళ్లను ఐపీఎల్‌కు దూరం పెట్టాయి. మరోవైపు అమీర్ గతంలో స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిషేధానికి గురికావడం కూడా వివాదాస్పదమే. ప్రస్తుతం అన్ని నిషేధాలు ముగిసినా… భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, దేశ భద్రతా అంశాలు, ప్రజల భావోద్వేగాలు వంటి కారణాలతో అతడికి నిజంగా అవకాశం వస్తుందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. చట్టపరంగా లైన్ క్లియర్ అయినా… ఫ్రాంచైజీలు అతడిపై బిడ్ వేయడానికి ముందుకు వస్తాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












