ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీస్ రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇంగ్లీస్ కేవలం 29 బంతుల్లో 60 పరుగులు చేసి మెరిపించగా.. మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 57 బంతుల్లో 96 పరుగులు చేసిన మార్ష్.. సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో రనౌట్ అయ్యాడు. మధ్యలో పూరన్ 16, పంత్ 35 పరుగులు చేశారు. ఓపెనర్ల సూపర్ షోతో లక్నో 220 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచింది.