పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. PCB తనకు ఇంకా వేలాది డాలర్ల పారితోషికం బకాయి ఉందని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితిని చూసి తన హృదయం ముక్కలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఫార్మాట్లలో జట్టు ప్రదర్శన క్రమంగా దిగజారిపోతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తనకు ఇంకా బకాయిలు చెల్లించకపోయినా.. పాకిస్థాన్ క్రికెట్‌లో అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం మాత్రం ఆపబోనని గిల్లెస్పీ స్పష్టం చేశారు. తాను మనసులో ఉన్నది నిర్భయంగా మాట్లాడినందుకే కోచ్ బాధ్యతల నుంచి తొలగించారని ఆరోపించారు. మౌనంగా ఉంటూ జీతం తీసుకుంటూ ఉండిపోవచ్చు.. కానీ అలా చేస్తే ఏళ్లుగా తాను నిర్మించుకున్న వ్యక్తిత్వానికి, ప్రతిష్టకు అన్యాయం చేసినట్టవుతుందని గిల్లెస్పీ వ్యాఖ్యానించారు. మొత్తంగా.. PCBతో విభేదాలపై గిల్లెస్పీ మరోసారి చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.