థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో భారత స్టార్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్– చిరాక్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్‌లో ప్రపంచ నంబర్-4 భారత జోడీ మలేషియా జంట గో జెఫీ–నూర్ ఇజ్జుద్దీన్‌పై 19-21, 22-20, 21-16 తేడాతో ఘన విజయం సాధించింది.
గంటా 22 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను కోల్పోయిన భారత జోడీ అద్భుతంగా పుంజుకుని రెండో సెట్‌ను కైవసం చేసుకుంది. నిర్ణాయక మూడో సెట్‌లో దూకుడుగా ఆడిన సాత్విక్–చిరాగ్ జంట 21-16తో మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయంతో మలేషియా జోడీపై హెడ్ టు హెడ్ రికార్డును 8-2కు పెంచుకుంది. ఈ సీజన్‌లో తొలి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న ఈ జోడీపై ఇప్పుడు భారత్ ఆశలన్నీ నెలకొన్నాయి.












