ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. ఒకవైపు ఉత్పాదకతను పెంచుతూ కొత్త అవకాశాలను సృష్టిస్తుంటే.. మరోవైపు దుర్వినియోగం కారణంగా ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి.

దక్షిణ కొరియాలో తాజాగా జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. అక్కడ నిర్వహించిన పోటీ పరీక్షలో కొంతమంది విద్యార్థులు AI గ్లాసెస్ ఉపయోగించి మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. దీంతో అధికారులు వారి ఫలితాలను రద్దు చేయడంతో పాటు నాలుగేళ్ల పాటు ఎలాంటి పరీక్షలు రాయకుండా నిషేధం విధించారు.

అధికారుల వివరాల ప్రకారం, ఈ AI గ్లాసెస్‌లో అమర్చిన కెమెరాలు, మైక్రోఫోన్లు ప్రశ్నలను సేకరించి విశ్లేషించి, స్పీకర్ల ద్వారా సమాధానాలను అందించాయి. ముఖ్యంగా ఇవి సాధారణ కళ్లద్దాల్లాగే కనిపించడం వల్ల గుర్తించడం చాలా కష్టమైంది.

ఈ ఘటనతో విద్యా వ్యవస్థలో AI దుర్వినియోగంపై పెద్ద చర్చ మొదలైంది. ఇలాంటి పరికరాలను గుర్తించేందుకు పరీక్షా నిర్వాహకులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు.

అధునాతన సాంకేతికత ఎంత ఉపయోగకరమో, దానిని తప్పుగా వినియోగిస్తే అంత ప్రమాదకరమని దక్షిణ కొరియా ఘటన మరోసారి స్పష్టం చేసింది. AI వినియోగంపై మరింత కఠిన నిబంధనలు అవసరమనే డిమాండ్‌కు ఈ సంఘటన బలం చేకూర్చింది.