డిజిటల్ వాలెట్ సంస్థ cash app వినియోగదారులు ట్యాప్-టు-పే ద్వారా సులభంగా చెల్లింపులు చేయడానికి NFC టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేక ‘పేమెంట్ వాండ్’ను విడుదల చేసింది. 25 డాలర్ల ధర కలిగిన ఈ వాండ్‌ను క్యాష్ యాప్ కార్డ్‌కు అనుసంధానం చేసుకుని, Visa ట్యాప్-టు-పే సదుపాయం ఉన్న అన్ని చోట్ల ఉపయోగించవచ్చు.

కీచైన్ రింగ్‌తో వచ్చే ఈ గాడ్జెట్‌ను బ్యాగ్‌లకు లేదా దుస్తులకు తగిలించుకోవచ్చు. ఫోన్ బయటకు తీయాల్సిన అవసరం లేకుండా కచేరీలు, క్రీడా కార్యక్రమాల్లో సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఖర్చు చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వాండ్ పోయినా యాప్ ద్వారా లాక్ చేయడం లేదా డీయాక్టివేట్ చేయడం సాధ్యమవుతుంది.

ఇది క్యాష్ యాప్ కొత్త “ట్యాగ్స్” హార్డ్‌వేర్ సిరీస్‌లో తొలి ఉత్పత్తి. రాబోయే నెలల్లో మరిన్ని డిజైన్లు, లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్లు అందుబాటులోకి రానున్నాయి. యువత, ముఖ్యంగా Gen Z వినియోగదారులను ఆకర్షించడమే ఈ కొత్త ఉత్పత్తి లక్ష్యంగా సంస్థ తెలిపింది.