
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ గ్రామం, మండల పరిధిలోని 4,356 చదరపు గజాల భూమికి సోమవారం విజయవంతంగా వేలం వేశారు. చదరపు గజానికి రూ.1,50,000ల కనీస ధరను హెచ్‌ఎండిఏ నిర్ణయించగా, పోటాపోటీగా సాగిన బిడ్డింగ్లో చదరపు గజానికి అత్యధికంగా రూ.1,64,000 ధర నమోదైంది. ఈ వేలం ద్వారా మొత్తం రూ.71.44 కోట్ల ఆదాయం హెచ్‌ఎండిఏకు సమకూరింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో కీలకమైన భూములకు కొనసాగుతున్న డిమాండ్ను ఇది ప్రతిబింబించడంతో పాటు, పారదర్శకమైన ఈ-వేలం ప్రక్రియ సమర్థతను మరోసారి నిర్ధారించిందని అధికారులు తెలిపారు. సరూర్‌నగర్‌లోని అభివృద్ధి చెందిన ప్రాంతంలో
ఈ భూమి ఉండటం వల్ల వేలానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి ఎల్బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు హైదరాబాద్‌లోని ఇతర ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతాలకు మంచి రవాణా సౌకర్యం ఉంది. ప్రధాన రవాణా మార్గాలకు సమీపంలో ఉండటం, ఇప్పటికే అభివృద్ధి చెందిన సామాజిక మౌలిక వసతులు అందుబాటులో ఉండటం వల్ల ఈ భూమికి భవిష్యత్ అభివృద్ధి అవకాశాలు, పెట్టుబడి ఆకర్షణ మరింత పెరిగాయని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు.













