
రోజుకు రూ.1,600-1,700 కోట్లు లాస్
ఇరాన్ యుద్ధంతో చమురు కంపెనీలపై పెరిగిన ఆర్థిక భారం
ఇలాగే కొనసాగితే కంపెనీల ఆర్థిక స్థితి దెబ్బతినొచ్చు
నిపుణుల హెచ్చరిక
త్వరలో ప్రజలకు పెట్రో షాక్?
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో యుద్ధం పరిస్థితులు భారతీయ చమురు కంపెనీలపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య సం ఘర్షణ ప్రారంభమై 10 వారాలు గడుస్తున్నా ప్రజలపై ఆ ప్రభావం పడకుండా ప్రభుత్వరంగ చమురు సంస్థలు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచకుండా పాత ధరలనే కొనసాగిస్తున్నాయి. దీనివల్ల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలి యం వంటి సంస్థలు ప్రతిరోజూ సుమారు రూ. 1,600 నుండి రూ.1,700 కోట్ల వరకు నష్టపోతున్నాయి.
గత 10 వారాల్లో ఈ మొత్తం నష్టం రూ.1 లక్ష కోట్లు దాటిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ధరలను 30 శాతం వరకు పెంచినప్పటికీ భారత్‌లో రెండేళ్ల క్రితం ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ. 94.77, డీజిల్ రూ.87.67గా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర 50 శాతం పెరిగినప్పటికీ సామాన్యులపై భారం పడకూడదనే ఉద్దేశం తో ధరలను పెంచడం లేదు. అయితే ఈ ప్రతికూ ల పరిస్థితులు ఇలాగే కొనసాగితే కంపెనీల ఆర్థిక స్థితిగతులు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. ముడి చమురు కొనుగోలు చేయడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ కంపెనీలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ పరిస్థితులను గమనిస్తే త్వరలో పెట్రో ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా నెలకు రూ. 14,000 కోట్ల భారాన్ని భరిస్తోంది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.13 నుండి రూ.3 లకు తగ్గించగా డీజిల్‌పై పూర్తిగా ఎత్తివేసింది. భవిష్యత్తులో చమురు నిల్వలు, పైప్లైన్లు, స్వచ్ఛమైన ఇంధన వనరుల అభివృద్ధిపై ఈ నష్టాల ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ తన అవసరాలకు కావాల్సిన 40 శాతం ముడి చమురును, 90 శాతం వంటగ్యాస్‌ను దిగుమతుల ద్వారానే పొందుతోంది.















