వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఈ ఏడాది సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో, ఇప్పటివరకు సుమారు 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.5 లక్షల కోట్లు) టారిఫ్‌లను అమెరికా ప్రభుత్వం దిగుమతిదారులకు తిరిగి చెల్లించింది. మంగళవారం కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద విధించిన సుంకాల ద్వారా మొత్తం సుమారు 166 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అందులో దాదాపు 60 శాతం, అంటే సుమారు 100 బిలియన్ డాలర్లను ఇప్పటికే తిరిగి చెల్లించింది. ఈ మొత్తాన్ని గతంలో సుంకాలు చెల్లించిన దిగుమతిదారులకే వాపసు చేసినట్లు అధికారులు తెలిపారు.

గత ఏడాది తిరిగి వైట్‌హౌస్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ట్రంప్, ఈ చట్టాన్ని ఉపయోగించి పలు వాణిజ్య భాగస్వామ్య దేశాలపై భారీ సుంకాలు విధించారు. అయితే, అలా చేయడానికి తనకు ఉన్న అధికారాలను ఆయన అతిక్రమించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో, మిత్రదేశాలు, ప్రత్యర్థి దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి టారిఫ్‌లను ఆయుధంగా వినియోగించే ట్రంప్ వ్యూహానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఉక్కు, అల్యూమినియం వంటి నిర్దిష్ట రంగాలపై వేర్వేరు చట్టాల ఆధారంగా విధించిన సుంకాలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి.

కోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిట్‌లో అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారి ఒకరు, జూలై 31 నాటికి 128.68 బిలియన్ డాలర్ల విలువైన సంభావ్య, ధ్రువీకరించిన సుంకాల వాపసు దరఖాస్తులను ప్రాసెసింగ్‌కు ఆమోదించినట్లు తెలిపారు. వాటిలో సుమారు 100 బిలియన్ డాలర్ల రీఫండ్ ప్రక్రియ పూర్తయి, లబ్ధిదారులకు చెల్లింపుల కోసం అమెరికా ట్రెజరీ శాఖకు పంపించినట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ట్రంప్ మరోసారి పలు దేశాలపై కొత్త మార్గాల్లో సుంకాలు విధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చర్యలపై కూడా ఇప్పటికే పలు న్యాయస్థానాల్లో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.