
కొబ్బరిమట్ట, హృదయ కాలేయం, కలర్ ఫొటో, బేబి వంటి చిత్రాలతో స్టోరీ రైటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్నారు సాయి రాజేష్. ఆయన కథను అందించి ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రేక్షకాదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల వసూళ్లను దాటి రెండో వారంలోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఈ నేపథ్యంలో సాయి రాజేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “హృదయకాలేయం , కొబ్బరిమట్ట సినిమాల సమయంలో డైరెక్టర్‌గా నా పేరు స్టీవెన్ శంకర్ అని పెట్టుకున్నా. స్టీవెన్ స్పీల్ బర్గ్ లోని స్టీవెన్, శంకర్ లోని శంకర్ తీసుకున్నదే స్టీవెన్ శంకర్. దర్శకుడిగా ప్రచార కార్యక్రమాల్లో నేను బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉండేది. అమ్మా నాన్నలు పెట్టుకున్న పేరుతోనే మన కెరీర్ కొనసాగించాలి అని అనుకుని కలర్ ఫొటో టైమ్‌లో సాయి రాజేష్ గా పేరు వేసుకున్నాను. ప్రేక్షకులు స్టీవెన్ శంకర్ అనే పేరును మర్చిపోయారా అనుకునే టైమ్ లో మా ‘చెన్నై లవ్ స్టోరీ‘ సినిమాలో హీరో కిరణ్ క్యారెక్టర్ కు స్టీవెన్ శంకర్ అని పెట్టుకోవడం కలిసొచ్చింది. దీంతో ఇంకొంతకాలం ప్రేక్షకులు స్టీవెన్ శంకర్ పేరు గుర్తుపెట్టుకుంటారు. ‘చెన్నై లవ్ స్టోరీ‘ సినిమాకు నేను దర్శకత్వం వహించాలనే ఉద్దేశం లేదు. ఎందుకంటే నేను డైరెక్టర్ గా బేబి సినిమా హిందీ రీమేక్ వర్క్‌లో ఉన్నాను. దర్శకుడిగా నా నెక్స్ మూవీ ఆలస్యమైనా ప్రొడక్షన్ మాత్రం కొనసాగించాలని ఉండేది. అలా రవి దర్శకత్వంలో ఈ సినిమా చేశాం. బేబి సినిమా చూశాక కొందరు వైష్ణవి క్యారెక్టర్ ను విమర్శించారు. విరాజ్ క్యారెక్టర్ లో క్లారిటీ లేదన్నారు. కానీ చెన్నై లవ్ స్టోరీ విషయంలో కిరణ్‌కు గానీ, గౌరి క్యారెక్టర్స్ విషయంలో ఎలాంటి నెగటివ్ కామెంట్స్ రాలేదు. కథాపరంగా కలర్ ఫొటో, బేబి కంటే నాకు ఎక్కువ సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఇక బేబి హిందీ రీమేక్ మరో 20 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సెప్టెంబర్ చివరి కల్లా షూటింగ్ పూర్తి చేస్తాం. మా సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి నాకు మెసేజ్ పంపారు. మరోసారి 50 కోట్ల గ్రాసర్ మూవీ చేశారని అభినందించారు” అని అన్నారు.











