మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ ముందు తాకట్టు పెట్టే రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన త ర్వాత రేవంత్ రెడ్డి 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వె ళ్లారని, దాదాపు ప్రతి 13 రోజులకు ఒకసారి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి సిఎం యాచిస్తున్నారో, వాళ్లకు ఇస్తున్నారో తెలియదు అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి సామంతులు కాకుండా స్వతంత్రులు కావాలని ప్రొ.జయశంకర్ సార్ చెప్పేవారని గుర్తు చే శారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఆయన ఎప్పుడూ చెప్పేవారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయం తి సందర్భంగా గురువారం తెలంగాణ భవన్‌లో కెటిఆర్, బిఆర్‌ఎస్ నేతలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ పార్టీల చేతుల్లో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కూడా ఢిల్లీకి సామంతుల్లా కప్పం కట్టే పరిస్థితి మళ్లీ వచ్చిందని ఆరోపించారు. నీరు పుష్కలంగా ఉన్నా కాళేశ్వరం, పాలమూరు పంపులను సిఎం రేవంత్‌రెడ్డి ఆన్ చేయడం లేదని విమర్శించారు. మనకేమో ప్రొ.జయశంకర్ సార్ గురువు అయితే, రేవంత్‌రెడ్డికేమో చంద్రబాబు గురువు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్ట్‌లను రద్దు చేయమని ఎపి ప్రభుత్వం కేంద్రాన్ని అడుగుతోందని మండిపడ్డారు. నిధులు ఢిలీకి పంపడం తప్ప సిఎం చేస్తున్నారని ఏమీ లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎపి ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని, జీఆర్‌ఎంబీ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ఆధారాలతో వివరించారని చెప్పారు.

జయశంకర్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె.జయశంకర్ సార్ ఆశయాల సాధనే ఆయనకు అందించే నిజమైన నివాళి అని కెటిఆర్ పేర్కొన్నారు. తనకు జయశంకర్ సార్‌తో పదేళ్ల పాటు కలిసి పనిచేసే అదృష్టం దక్కిందని తెలిపారు. ఆయన ఒక ఎన్‌సైక్లోపీడియా, గొప్ప ఉపాధ్యాయుడు అని కొనియాడారు. ఇప్పుడు మనం తెలంగాణ సాధించిన కెసిఆర్‌ను తెలంగాణ జాతిపితగా గౌరవించుకుంటున్న తీరుగానే, ఉద్యమ కాలంలో కెసిఆర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను తనకు ఒక గాడ్ ఫాదర్‌గా భావించారని అన్నారు.