
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి నిర్వహణ, కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)ను స్పష్టత కోరు తూ గురువారం లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం అందుబాటు లో ఉన్న నీటిలో రెండు తెలుగు రాష్ట్రాల వాటాల ను ఖరారు చేసేందుకు తక్షణమే బోర్డు సమావే శం లేదా సభ్య కార్యదర్శి కమిటీ సమావేశాన్ని ఏ ర్పాటు చేయాలని కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అధికారికంగా లేఖ రాశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిలో రెండు తెలుగు రాష్ట్రాలకు లభ్యత ఉన్న నీటి కేటాయింపులపై సమగ్రంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో స్పష్టం చేసింది. కేవలం నీటి వాటాల అంశం ఒక్కదానిపైనే చర్చించేలా సింగిల్ పాయింట్ ఎజెండాతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని కోరింది. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఎల్-నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని, దీనివల్ల వర్షపాతంపై ప్రభావంపడే ప్రమాదం ఉందని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో లభ్యమయ్యే ప్రతి చుక్క నీటిని అత్యంత జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కిచెప్పింది.
నీటి వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే, ఇరు రాష్ట్రాల మధ్య వాటాల పంపిణీపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని కోరింది. కేటాయింపులు ఖరారయ్యే వరకు ప్రతి ఏడాది తాత్కాలిక విధానంతో కొనసాగడం వల్ల వివాదాలు పెరుగుతున్నాయని ఏపీ పేర్కొంది. ఈ అంశం తుది పరిష్కారం కోసం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయం కూడా కీలకంగా ఉంది. అయితే గతంలోనే కృష్ణా జలాల్లో 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ప్రస్తుత తాత్కాలిక పంపకాలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. దీంతో కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలకాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీలైనంత త్వరగా బోర్డు సమావేశాన్ని నిర్వహించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఏపీ ప్రభుత్వం తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది.











