పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ. 105.44 కోట్ల మేర రుణం ఎగవేతకు పాల్పడిన ’ఎన్‌సిఎస్ షుగర్స్’ వ్యవహారం లో హైదరాబాద్, విజయనగరం తో సహా 10 ప్రాంతాల్లోని వాణిజ్య, నివాస ప్రాంగణాల్లో శుక్రవారం సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, విజయనగరం, కాకినాడలోని 10 ప్రాంతాలలో సిబిఐ సమన్వ యంతో కూడిన సోదాలు నిర్వహిం చింది. ఇందులో ఎన్‌సిఎస్ షుగర్స్ లిమిటెడ్ డైరెక్టర్లకు సంబంధించిన ఫ్యాక్టరీ, రిజిస్టర్డ్ కార్యాలయం, నివా స ప్రాంగణాలు ఉన్నాయి. ఈ సోదాల సమయంలో దర్యాప్తుకు సంబంధించిన రికార్డులతో సహా నేరానికి సంబంధించిన పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ పేర్కొంది. నేరపూరిత కుట్ర యొక్క పూర్తి స్థాయిని నిర్ధారించడానికి, నిధుల మళ్లింపు, కదలికలను గుర్తించడానికి, అలాగే ఇందులో పాల్గొన్న వ్యక్తుల నిర్దిష్ట పాత్రలను తేల్చడానికి స్వాధీనం చేసుకున్న సామగ్రిని పరిశీలిస్తున్నట్లు సిబిఐ తెలి పింది. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు ఆధారంగా ఎన్‌సిఎస్ షుగర్స్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, అజ్ఞాత ప్రభుత్వ అధికారులపై బెంగళూరులోని సిబిఐ బ్యాంకింగ్ సెక్యూరిటీస్ అండ్ ఫ్రాడ్ బ్రాంచ్‌లో ఈ బ్యాంక్ మోసం కేసు నమోదైంది.

నేరపూరిత కుట్ర, మోసం, నమ్మక ద్రోహం, ఆస్తి దుర్వినియోగం, ఫోర్జ రీ వంటి నేరాలకు పాల్పడి పిఎన్‌బి బ్యాంకుకు రూ. 105.44 కోట్ల మేర అక్రమ నష్టాన్ని కలిగించారని ఫిర్యాదులో ఆరోపించినట్లు సిబిఐ పేర్కొంది. నిందితులు నకిలీ పత్రాలను అసలైనవిగా చూపి రుణమిచ్చే బ్యాంకుకు సమర్పించారని ఆరోపణ లున్నాయి. ఈ పత్రాల ఆధారంగా నిందితులు రుణ సదుపాయాలను పొందారని, ఆ తర్వాత రుణ నిధులను వ్యాపార అవసరాలకు వినియో గించడానికి బదులుగా మళ్లించి దుర్వినియోగం చేశారని సిబిఐ వెల్లడించింది. నిందితులు బ్యాంకుకు బకాయిలను చెల్లించడంలో విఫలమయ్యా రని, దీనివల్ల సదరు కంపెనీ రుణ ఖాతాలు క్రమరహితంగా మారడం లేదా డిఫాల్ట్ కావడం జరిగిందని, తద్వారా రుణమిచ్చిన బ్యాంకుకు నష్టం వాటిల్లిందని సంస్థ తెలిపింది. ’ప్రాజెక్ట్ అండ్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్’ను రూ. 82.11 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలకు సంబంధించి న మరో కేసులో ఎన్‌సిఎస్ షుగర్స్‌కు చెందిన కనీసం ఇద్దరు అధికారులపై 2017లోనే సిబిఐ కేసు నమోదు చేసింది.