
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో పూజారులకు శనివారం నుంచి కొత్త దుస్తుల నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై ఆలయంలోని పూజారులంతా ఒకే విధమైన సంప్రదాయ వస్త్రధారణలో కనిపించనున్నారు. ఆలయ ట్రస్ట్ మత వ్యవహారాల కమిటీ సభ్యురాలు మిథిలేశ్ నందిని శరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామానంది సంప్రదాయానికి అనుగుణంగా పూజారులకు ఈ వస్త్రధారణను నిర్దేశించారు. పూజారులు లేత పసుపు రంగు పట్టు ధోతీలు, అదే రంగు పట్టు ఉత్తరీయాలు ధరించాలి.లేత పసుపు రంగు శ్రీరాముడికి ప్రీతికరమైనదిగా భావిస్తారని, అందుకే ఈ రంగును ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. పూజారుల వస్త్రధారణతో పాటు వారి కేశాలంకరణ,
వ్యక్తిగత రూపురేఖలకు సంబంధించిన నిబంధనలను కూడా కమిటీ నిర్దేశించింది. పూజారులు ‘పంచకేశ’ సంప్రదాయాన్ని పాటించాలి లేదా పూర్తిగా గుండు చేయించుకోవాలి. మధ్యస్థంగా పెరిగిన జుట్టు లేదా గడ్డంతో ఉండటాన్ని అనుమతించరు. సంప్రదాయ రామానంది తిలకాన్ని ధరించడం కూడా తప్పనిసరి చేశారు. మత వ్యవహారాల కమిటీ సభ్యుడు మహంత్ రాజ్‌కుమార్ దాస్ మాట్లాడుతూ.. పట్టు వస్త్రాలు పవిత్రత, శుద్ధతను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ ఏకరూప వస్త్రధారణ వల్ల పూజా కార్యక్రమాలు, రామలల్లా సేవలో మరింత క్రమశిక్షణ, ఏకరూపత, ఆధ్యాత్మిక గౌరవం నెలకొంటుందని కమిటీ పేర్కొంది.











