హైదరాబాద్: ప్రతి ఒక్కరూ సర్ పై సీరియస్ గా దృష్టి సారించాలని, పార్టీ పరంగా సర్ ఇన్ ఛార్జీలుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇన్ ఛార్జ్ లుగా ఉన్న చోట ఎంపిలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సర్ పై జూమ్ సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారని, 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సర్ పై 489 భేటీలు జరిగాయని తెలియజేశారు. వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని, ఛైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దని, పదవుల కోసం గాంధీభవన్ లో అపాయింట్ మెంట్లు ఇవ్వొద్దని కోరారు. రేపటి నుంచి ఆగస్టు 3వరకు నేతలు గాంధీభవన్ కు రావొద్దని సూచించారు. కొందరు నేతలు హైదరాబాద్ లో కూర్చోని పనిచేయట్లేదని విమర్శించారు.

ఇన్ ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో సర్ పై సమీక్షలు నిర్వహిస్తారని, ఎంపిలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని అన్నారు. ఇన్ ఛార్జ్ లుగా ఉన్న చోట ఎంపిలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బిఎల్ వోల నివేదికల కంటే బిఎల్ ఎల రిపోర్టులను పరిశీలించాలని, బిఎల్ వోల రిపోర్టులపై మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీ పరంగా పనిచేస్తున్న బిఎల్ ఎలను నేతలు సమర్థవంతంగా ఉపయోగించాలని, పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదు అని సూచించారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని, సర్ కు నియమించిన పార్టీ ఇన్ చార్జ్ లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని అన్నారు. బిఎల్ ఎ, బిఎల్ వొ రిపోర్టులను గాంధీభవన్ బృందం ఎప్పటికప్పుడు పరిశీలించాలని, సర్ ను ఇన్ ఛార్జ్ మంత్రులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిందేనని ఆదేశించారు. ఈ నెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని, పిసిసి చీఫ్, భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని సమన్వయం చేయాలని కోరారు. బాగా పనిచేసే వంద మంది బిఎల్ఎలకు అగ్రనేత రాహుల్ గాంధీ తో ఫోటో దిగే అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి కోరారు.