ఢిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఢిల్లీలో జరిగిన కీలక భేటీలపై స్పందించారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిశానని కొండా సురేఖ తెలిపారు. తనకు జరుగుతున్న పరిణామాలన్నింటినీ వారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తాను చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని, పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చిందని ఆమె వెల్లడించారు.

ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో సురేఖ ఇప్పటికే పలుమార్లు ఖర్గేతో భేటీ అయ్యారు. సుస్మితా పటేల్ వ్యాఖ్యలపై ఆమె ఖర్గేకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని, నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని ఖర్గే సూచించినట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన అంశాలను పార్టీ వేదికపైనే ప్రస్తావించాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. మంత్రి కూతురు చేసిన వ్యాఖ్యలకు మంత్రిపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే స్పష్టం చేశారు. గతంలో రెండుసార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో క్రమశిక్షణా కమిటీ నివేదికను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌కు పంపించినట్లు ఆయన తెలిపారు.

అయితే కొండా సురేఖ సీనియర్, హైప్రొఫైల్ నాయకురాలని.. ఆమెపై చర్యలు ఉంటాయా? లేదా? అనేది పూర్తిగా ఏఐసీసీ పరిధిలోని అంశమని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.

దీంతో కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.