జవహర్ నగర్ డంప్ యార్డ్‌కు ప్రతి రోజూ చేరుతున్న సుమారు పది వేల మెట్రిక్ టన్నుల చెత్తను మహానగరమైన ఢిల్లీలో కాలుష్యం లేకుండా చేస్తున్న విధంగా ఆధునిక పద్ధతిలో రీ-సైక్లింగ్, చెత్త నిర్వహణ (వేస్ట్ మేనేజ్‌మెంట్) చేపడతామని కేంద్ర మంత్రి ఖట్టర్ హామీ ఇచ్చారని బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఎంపీలు ఈటల రాజేందర్, డికె అరుణ తదితర ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి చర్చించారు. అనంతరం ఎంపీ ఈటల మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ జనాభా 30 లక్షల మంది ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన జవహర్ నగర్ డంపు యార్డ్ ఇప్పుడు రెండు కోట్ల మంది జనాభాకు చెత్త వేసే ప్రాంతంగా మారిందని అన్నారు. ఈ విషయంపై గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారని గుర్తు చేశారు.

దీనిపై తాను సుప్రీం కోర్టులో కేసు వేశానని, రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కేసు వేసినట్లు చెప్పారు. గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త వల్ల 40 కిలో మీటర్ల పరిధి వరకూ కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. లక్షల మంది ఆరోగ్యం దెబ్బతింటున్నదని, సంపాదించినదంతా ఆసుపత్రులకే ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఆయన బాధను వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలిసి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరానని చెప్పారు. ఢిల్లీ లాంటి నగరంలో చెత్తను మేనేజ్ చేస్తున్నట్లే, హైదరాబాద్‌లో కూడా ఆ పద్ధతులు అవలంబించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కెపాసిటీ కేవలం 3,500 మెట్రిక్ టన్నులు మాత్రమే కాగా, నిత్యం 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందని అసలు ఆ ప్లాంట్ సరిగ్గా పనిచేస్తోందో లేదో పర్యవేక్షించే నాథుడే లేడని ఎంపీ ఈటల విమర్శించారు.